కిరణ్ టి.వి, హైదరాబాద్ :- ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ గురించి చెప్పాలంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోందని చెప్పేవారు. అటువంటి పరిశ్రమ ఈరోజు కళా విహీనంగా తయారైంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిశ్రమలోని ప్రముఖులంతా వ్యవహరిస్తున్నారు. ఎవరి స్వార్థం వారిది.. ఎవరి డబ్బు వారిది.. ఇతర విషయాల గురించి వీరికి అనవసరం. పేరుకు అందరూ పెద్ద మనుషులే కానీ పెద్దరికం లేని మనుషులుగా మాత్రమే కొనసాగుతున్నారు. మొదటి తరంలో ఒక్కో హీరో సంవత్సరానికి 7 నుంచి 10 సినిమాలు కచ్చితంగా చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ లాంటివారు 15 సినిమాలు చేసేవారు. దీంతో పరిశ్రమ ఎప్పుడూ కళకళలాడుతుండేది. 24 విభాగాలవారికి 365 రోజులు పని దొరికేది.
కాలంతోపాటు మనస్తత్వాలు మారిపోయాయి
కాలం మారింది.. కాలంతోపాటు మనుషుల మనస్తత్వాలు మారిపోయాయి. నైతిక విలువలు, నిబద్ధత, నిజాయితీ, ఆపదలో ఆపన్న హస్తంలాంటివన్నీ అందరూ మర్చిపోయారు. పరిశ్రమ అన్నతర్వాత అందులో ఉన్నవారు కూడా మనుషులకు అతీతులేంకాదుగా.. అందుకే అవన్నీ వారికి కూడా వర్తిస్తాయి. మూడేళ్లకో, రెండేళ్లకో ఓ సినిమా, అందకు తగ్గ పారితోషికం, సినిమా ఆడిందా? లేదా? అనేది మనకనవసరం, నిర్మాత బాగున్నాడా? లేడా? అనేది పట్టించుకోవాల్సిన అవసరంలేదు.. వీరు కాకపోతే మరొకరు అన్నట్లుగా తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద మనుషుల మనస్తత్వాలు ఉన్నాయి. సినిమాల్లో ఎక్కడలేని హీరోయిజం చూపించేవారంతా నిజ జీవితంలోకి వచ్చేసరికి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వీరికి తోడు దర్శకులు కూడా. ఒక్క షాట్ తీయడానికి 24 గంటల సమయం తీసుకునేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి అంత సమయం తీస్తేకాని సన్నివేశం సరిగా ఇవ్వలేనంత నటన లేని హీరోలు, నటులు మనదగ్గరున్నారా? అని ఆశ్చర్యం వేస్తుంటుంది.
చిటికెన వేలి కొసమీద తీసేవారు
ఒకప్పుడు బిఎన్ రెడ్డి, విఠలాచార్య, కమలాకర కామేశ్వరరావు లాంటి మేరునగ ధీరుల్లాంటి దర్శకులు సినిమాలను చిటికెన వేసి కొసమీద తీసేవారు. అందులోని దృశ్యాలు తీయడానికి ఆరోజు ఎటువంటి కంప్యూటర్లు లేవు.. విజువల్ ఎఫెక్ట్స్ లేవు.. వీఎఫ్ఎక్స్ వర్క్ లేదు.. కానీ ఇప్పుడు సినిమాలు తీసే దర్శకులకన్నా అద్భుతంగా తీశారు. ఇప్పుడున్న దర్శకులు మాత్రం సన్నివేశాలన్నీ తీసేసి వీఎఫ్ఎక్స్, విజువల్ వర్క్ అంటూ నెలల తరబడి, సంవత్సరాల తరబడి సమయం ఐస్ క్రీం తిన్నంత సులువుగా తినేస్తున్నారు. దీంతో నిర్మాత పెట్టుబడి పెట్టే డబ్బు, ఆ డబ్బుమీద వడ్డీ హిమాలయ పర్వతం అంత అవుతున్నాయి. హీరోలకు దర్శకులు, దర్శకులకు హీరోలు తందానా అంటుండటంతో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు ఏంచేయలేని పరిస్థితి. సినిమా పూర్తయి చేతికి వచ్చినప్పుడు వచ్చిందనుకోవడమే. ఎవరికివారే తామంతా అమరశిల్పి జక్కన్న అనుకుంటున్నారు. శిల్పం చెక్కడం ఒక ఎత్తయితే.. దానిని సజీవ ప్రతిమలా తీసుకురావడం మరో ఎత్తు. దర్శకులు కూడా తాము సన్నివేశాలన్నీ తీయడం ఒక ఎత్తు.. తమ చేతిలోలేని విజువల్ ఎఫెక్ట్స్ కోసం సమయాన్ని వృథా చేయడం మరో ఎత్తు అనుకుంటున్నారు తెలుగు సినీ ప్రియులు. అంతిమంగా హీరోలు, దర్శకులు కలిసి తెలుగు సినీ పరిశ్రమను పూర్తిగా అథ:పాతాళానికి తీసుకువెళ్లడానికి ఎక్కువ సమయం పట్టదని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారంటే పరిశ్రమలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
