కిరణ్ టీవీ, ఢిల్లీ :- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రజలను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఉచితాలపై దృష్టి సారించాయి. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, వాటి పరిష్కారాల కోసం పెద్దగా చర్చలు జరగకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీలో వాయు కాలుష్యం, శాంతిభద్రతల సమస్యలు, మహిళలపై నేరాలు వంటి వాటిపై పెద్దగా ఎన్నికల వేళ వాటి ప్రస్తవానే లేదు. మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత విద్యుత్, ఇతర సంక్షేమ పథకాలపై ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ మొదలైంది.
పథకాలు ప్రకటించడంలో ఆప్ దూకుడు
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో “రేవ్‌డీ పర్ చర్చా” అనే పేరుతో ఉచితాలపై చర్చను ప్రారంభించాలని ప్రకటించారు. కేజ్రీవాల్ ప్రస్తావించిన ఉచిత పథకాలు ప్రధానంగా విద్యుత్, వైద్యం, విద్య, మహిళలకు రవాణా వంటి అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ద్వారా మహిళలకు నెలకు రూ.2,100 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రుల్లో వృద్ధులకు ఉచిత వైద్యం అందించే ‘‘సంజీవని యోజన’’ అమలు చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. అదనంగా దేవాలయం, గురుద్వార పూజారులకు జీతంలో పెంపు, సెక్యూరిటీ గార్డులను నియమించుకునేందుకు నివాస సంక్షేమ సంఘాలకు ఆర్థిక సాయం అందించే ఆర్థిక పథకాన్ని కూడా ఆయన ప్రకటించారు.
రంగంలో కాంగ్రెస్ కూడా
కాంగ్రెస్ పార్టీ కూడా ఉచితాల పై పోటీలో భాగమైంది. మహిళల కోసం “ప్యారీ దీదీ యోజన” పేరుతో నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ‘‘జీవన్ రక్షా యోజన’’ కింద రూ.25 లక్షల బీమా కల్పించేందుకు కంగ్రెసు పార్టీ సిద్ధమైందని వెల్లడించింది. నిరుద్యోగ యువతకు యువ ఉడాన్ యోజన పేరు ప్రతి నెలా రూ.8500 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు.
భాజపా ఉచితాలకు దూరంగా ఉన్నప్పటికీ
ముందు ఉచితాలపై నిర్లక్ష్యంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (భాజపా) కూడా ఇప్పుడు ఉచితాలపై సన్నాహాలు మొదలుపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవల ఢిల్లీలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. “భాజపా అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం.” అలాగే, పార్టీ మేనిఫెస్టోలో ‘‘ఉచిత’’ హామీలను కూడా అందించేందుకు భాజపా సిద్ధమవుతున్నట్లు సమాచారం. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఇళ్లకు 300 యూనిట్లు, ప్రార్థనా స్థలాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్న ప్రతిపాదనలను ఎన్నికల హామీల్లో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది.
ప్రజా సమస్యలు వెనక్కి
ప్రధాన రాజకీయ పార్టీలు ఉచితాలపై చర్చ చేస్తుండగా, దిల్లీని వేదిస్తున్న అనేక సమస్యలు పెద్దగా ప్రస్తావనకు రాలేకపోతున్నాయి. ఢిల్లీలోని వాయు కాలుష్యం ఒక ముఖ్యమైన సమస్యగా మారింది. నగరంలోని చాలా ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. యమునా నదిలో అమ్మోనియా స్థాయిలు పెరిగిపోవడం, నీటిశుద్ధి కేంద్రాలు వాటిని సరైన రీతిలో శుద్ధి చేయకపోవడంపై విమర్శలు ఉన్నాయి. వర్షాకాలంలో రోడ్లు దెబ్బతినడం, గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇంకా, ఢిల్లీలో శాంతిభద్రతల సమస్య కూడా మరింత తీవ్రమైంది. మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి, అలాగే కొన్ని ముఠాలు అనేక దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో, ప్రజలు నగరంలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కోరుతున్నారు.
ప్రజల ఆశిస్తున్నదేమిటి?
ఢిల్లీ వాసులు, సామాజిక వేత్తలు నగరాన్ని ఊపిరి తీసుకోనివ్వకుండా చేసే కాలుష్యం, నీటి కొరత, రోడ్ల సమస్యలు, శాంతిభద్రతల సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నారు. కాగా, ఈ ఉచితాల మధ్య ప్రజల సాధారణ సమస్యలు విస్మరిస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.